పాల్గోన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
సిరా న్యూస్,హైదరాబాద్;
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో భారతీయ విద్యా భవన్ లో జరిగిన రోజ్గార్ మేళా కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గోన్నారు.
కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఇవాళ అపాయింట్మెంట్ లెటర్లు అందుకుంటున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు. మీ తల్లిదండ్రులకు కూడా మన:పూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ ధన త్రయోదశి, దీపావళి శుభాకాంక్షలని అన్నారు. యువతకు ఉద్యోగ కల్పనకోసం ఉద్దేశించిన ఈ రోజ్గార్ మేళాల్లో ఇది 10వది. దేశవ్యాప్తంగా 51వేల మంది ఇవాళ నియామకపత్రాలు అందుకుంటున్నారు. 10 కేంద్ర ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన ఉద్యోగాలకు ఇవాళ అపాయింట్మెంట్ లెటర్లు అందజేస్తున్నాం. ఇవాళ్టితో కలిపి ఇప్పటివరకు.. మొత్తం 8.5 లక్షలమంది యువతీ యువకులు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ ఉద్యోగాలకు సంబంధించిన అపాయింట్మెంట్ లెటర్లు అందుకున్నారని అన్నారు.
22 అక్టోబర్ 2022 నాడు దేశ యువతకు దీపావళి కానుకగా ‘రోజ్ గార్ మేళా’ను ప్రధానమంత్రి ప్రారంభించారు. ఇదొక నిరంతర ప్రక్రియ.. 12 లక్షల ఉద్యోగాలు టార్గెట్ గా పెట్టుకుని.. దీన్ని పూర్తిచేసే దిశగా కేంద్రం ముందుకెళ్తోంది. నరేంద్రమోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక.. ఇది మొదటి రోజ్గార్ మేళా. ఇవాళ మన సికింద్రాబాద్ వేదికగా..180 మంది యువతీ యువకులకు ఇవాళ అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తున్నాము. ఇందులో పోస్టల్ డిపార్ట్ మెంట్, ఏయిమ్స్, ఏయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, డిపార్ట్ మెంట్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్, ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్, ఎఫ్సీఐ, ఎన్టీపీసీ , రైల్వేస్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తదితర పది సంస్థలకు సంబంధించిన ఉద్యోగులున్నారు.
ఈ 12 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ రంగ, కేంద్ర ప్రభుత్వ వ్యవస్థ పనిచేసేందుకు అవసరమైన ఉద్యోగాలు మాత్రమే. కానీ ప్రయివేటు రంగంలో కోట్ల సంఖ్యలో ఉద్యోగాలు సిద్ధమవుతున్నాయి. ప్రైవేటు రంగంలో భారీ సంఖ్యలో ఉద్యోగాల కల్పనకోసం కేంద్రం అవసరమైన చర్యలు తీసుకుంటోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ యువశక్తితో భవ్యమైన భారతదేశాన్ని నిర్మించేందుకు యువశక్తి సామర్థ్యాన్ని సంపూర్ణంగా సద్వినియోగ పరిచేందుకు అన్నిరకాలుగా కృషిచేస్తోంది.5జీ సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. దీంతో మరిన్ని అవకాశాలు పెరిగాయి. దీన్ని కూడా యువత అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. రక్షణ రంగంలో ఎగుమతులు 2014లో రూ.900 కోట్లు ఉంటే.. ఇప్పుడు దాదాపుగా రూ.15వేల కోట్ల ఎగమతులు చేస్తున్నాం. 75 దేశాలకు మన రక్షణ ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. దీని ద్వారా కూడా ఉపాధి గణనీయంగా పెరిగింది. ‘సర్వజన హితాయ.. సర్వజన సుఖాయ’ నినాదంతో.. ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు వచ్చే 1000 ఏళ్లకు అవసరమైన బాటలు వేస్తాయనేది అనేది మోదీ ఆలోచన. అందుకే.. 2047నాటికి నిర్దేశించుకున్న వికసిత భారత్ లక్ష్యాలను చేరుకునే లక్ష్యంతో.. జరుగుతున్న ఈ ప్రయత్నంలో మీ అందరి సహకారం కావాలని అన్నారు.