స్కానింగ్ సెంటర్ లో దారుణాలు

సిరా న్యూస్,నిజామాబాద్;
కామారెడ్డి జిల్లాలో స్కానింగ్‌లకు సంబంధించిన అంశాలు తీవ్ర వివాదాస్పదంగా మారుతున్నాయి. గతంలో దొంగ సర్టిఫికేట్లతో ఆస్పత్రులు నడుపుతున్నట్లు.. వాటిలో లింగ నిర్దారణ పరీక్షలు చేసినట్లు గుర్తించిన పోలీసులు, వైద్యశాఖ అధికారులు.. ఇప్పుడు మరో కొత్త రకం దారుణాలను వెలుగులోకి తెచ్చారు. కామారెడ్డి జిల్లాలోని రాజంపేట్‌ పరిధిలో మొబైల్‌ వైద్య పరీక్షల ముసుగులో లింగ నిర్ధారణ టెస్టులు చేస్తున్న ముఠా ఆట కట్టించారు.పోర్టబుల్‌ స్కానింగ్‌ మిషన్‌ ద్వారా ఇళ్ల దగ్గరే.. లింగ నిర్ధారణ పరీక్షలు.. అబార్షన్‌లు చేస్తున్నట్లు గుర్తించి రవీందర్ అనే వ్యక్తిని ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. అతని విచారణ తర్వాత తాజాగా.. మరో ఐదుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే.. వేర్వేరుగా దర్యాప్తు చేసిన పోలీసులు, వైద్యాధికారులు.. నిందితులు చెప్పిన వాస్తవాలతో షాక్‌ అయ్యారు. మూడు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో 35కు పైగా అబార్షన్లు చేసినట్లు తేల్చారు. ఈ ముఠా.. లింగ నిర్ధారణకు 15 వేలు.. అబార్షన్‌కు 70 వేలు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. ప్రధానంగా.. కామారెడ్డి జిల్లాలోని రాజంపేట్‌ పీహెచ్‌సీ కేంద్రంగానే లింగ నిర్ధారణ టెస్టులు జరిగినట్లు… కొందరు వైద్య శాఖ సిబ్బంది సహకరించినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.పోలీసు ఎంక్వైరీ తర్వాతే ఈ వ్యవహారం తమ దృష్టికి వచ్చిందన్నారు రాజంపేట్‌ పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌ విజయమహాలక్ష్మి. దీనికి సంబంధించి గతంలో ఓ సారి డీఎంహెచ్‌వో హెచ్చరించడడంతో అప్పటినుంచి అప్రమత్తంగానే ఉన్నామని చెప్పారు. సబ్‌ సెంటర్ల నుంచి అబార్షన్‌ లిస్టులు తీసుకున్నామని.. కానీ.. వాటిలో ఇలాంటి కోణాలు లేవని.. సాధారణంగా జరిగిన అబార్షన్‌లే రెండు, మూడు గుర్తించామని తెలిపారు. అయితే.. ప్రస్తుతం నిందితులు వాడిన పోర్టబుల్‌ స్కానింగ్‌ మిషన్‌ కావడంతో ఎక్కడెక్కడ టెస్టులు చేశారనేది ఇంకా తేలాల్సి ఉందన్నారు రాజంపేట్‌ పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌. అటు.. నిందితులు వాడిన పోర్టబుల్‌ సోనోగ్రాఫ్‌ స్కానింగ్‌ మిషన్‌కు లైసెన్స్‌ ఉన్నట్లు చెప్తున్నప్పటికీ.. దానికి సంబంధించిన ఆధారాలను వెరిఫై చేయాల్సి ఉందన్నారు పోలీసులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *