సిరా న్యూస్,హైదరాబాద్;
గూడెం మహిపాల్ రెడ్డి పార్టీని వీడటంతో బీఆర్ఎస్ క్యాడర్ అంతా ఆయనతో పాటు హస్తం గూటికి చేరిపోతారనుకున్నారంతా. గూడెం కూడా అదే భావించారు. కానీ అలా జరగలేదు. బొల్లారం, తెల్లాపూర్, అమీన్ పూర్ మూడు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పాలకపక్షమే ఉంది. ఇందులో అమీన్ పూర్ మున్సిపల్ ఛైర్మన్ పాండురంగారెడ్డి ను వీడి గూడెం మహిపాల్ రెడ్డితో పాటు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.ఇక బొల్లారం మున్సిపల్ ఛైర్మన్ కొలను రోజా, తెల్లాపూర్ మున్సిపల్ ఛైర్మన్ లలితా సోమిరెడ్డి బీఆర్ఎస్ లోనే ఉన్నారు. ఇక GHMC పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, భారతీ నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి కూడా గూడెంతో వెళ్ళబోమంటూ బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారు. దీంతో గూడెం కొంతమంది కార్యకర్తలతోనే కారు దిగి కాంగ్రెస్ లో చేరిపోవాల్సి వచ్చిందిబీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఒక్కతాటిపై నడిపిన గూడెం బాధ్యతలు ఇప్పుడు ఎవరికి ఇస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. పార్టీలో సీనియర్లుగా ఉన్న కొలన్ బాల్ రెడ్డి, సోమిరెడ్డి, ఆదర్శ్ రెడ్డి, మెట్టుకుమార్ యాదవ్ లు నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతల కోసం మాజీమంత్రి హరీశ్ రావును కలుస్తూ తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ వీడిన తెల్లారే పటాన్ చెరులోని ఆదర్శ్ రెడ్డి ఇంట్లో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు హరీశ్ రావు. లీడర్లు, క్యాడర్ లో మనోధైర్యం నింపే ప్రయత్నం చేశారు. అప్పటినుంచి మెట్టు కుమార్ యాదవ్, ఆదర్శ్ రెడ్డి, కొలన్ బాల్ రెడ్డి, సోమిరెడ్డి వారి ప్రయత్నాలను ముమ్మరం చేశారు.ఎవరికి వారు తమ సీనియారిటీని, అర్హతలను వివరిస్తూ నియోజకవర్గ ఇంఛార్జి బాధ్యతలు దక్కించుకోవాలని చూస్తున్నారు. తన సామాజికవర్గ ప్రజలు ఎక్కవగా ఉన్న పటాన్ చెరులో తనకు బాధ్యతలు అప్పగిస్తే పార్టీని తిరుగులేని శక్తిగా మార్చుతానని అంటున్నారు మెట్టు కుమార్ యాదవ్. అలాగే మిగిలిన నేతలూ తమకున్న అడ్వాంటేజీలను అధిష్టానం పెద్దలకు వివరిస్తూ ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. మరి హరీశ్ రావు ఆశీస్సులు ఎవరికి ఉంటాయో.. పటాన్ చెరు పగ్గాలు ఎవరికి అప్పగిస్తారో వేచి చూడాల్సిందే.