సిరాన్యూస్, ఇచ్చోడ
నిర్లక్ష్యం వహించిన అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలి: కలెక్టర్ రాజర్షి షా
ఇంటింటి ఇండ్ల జాబితా సర్వే లో నిర్లక్ష్యం వహించిన ఎంపీడీఓ ,ఏఓ, పంచాయతీ సెక్రటరీ లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సంబంధిత అధికారులను జిల్లా పాలనాధికారి రాజర్షి షా ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం గెర్జం, ముఖ(కె) గ్రామాల్లో బుధవారం సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే – సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను జిల్లా పాలనాధికారి రాజర్షి షా పరిశీలించారు. అనంతరం ఇచ్చోడ మండలం ముఖా(కె) లో సేంద్రీయ ఎరువుల తయారీ కేంద్రాన్ని , ఏపుగా పెరిగిన టెకుచెట్లను జిల్లా పాలనాధికారి రాజర్షి షా పరిశీలించారు. ఈ సందర్భంగా గెర్జం గ్రామం లో ఇళ్ల జాబితా సర్వే సరిగా నిర్వహించకపోవడం తో, స్టిక్కర్ల పై సరైన వివరాలు నమోదు చేయకపోవడం, సర్వే కు సంబంధించి మ్యాప్ ద్వారా ఎక్కడి నుండి ఎక్కడి వరకు సర్వే నిర్వహించాలో ముందుగా నిర్దారించక పోవడం, సర్వేలో అన్ని తప్పులు నమోదు చేయడంతో ఎంపీడీఒ లక్ష్మణ్, ఏఓఏ .కైలాస్, పంచాయితీ సెక్రటరీ సయ్యద్ ఏజాజ్ హస్మి లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.గత కొద్ది రోజులనుండి సమగ్ర ఇంటింటి ఇళ్ళ జాబితా, పూర్తి సర్వే పై శిక్షణలు, సమావేశాలు, గూగుల్ మీట్, టెలీ కాన్ఫరెన్స్ ద్వారా పూర్తి అవగాహన , దిశా నిర్దేశం చేసినప్పటికీ విధులు సక్రమంగా నిర్వహించకపోవడం తో విధులలో నిర్లక్ష్యం వహించినందున వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగిందని తెలిపారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే – సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే , కుటుంబ వివరాల షెడ్యూల్ ఫారం (స్టిక్కర్)లో ఉన్న వివరాలు ఎన్యుమరేషన్ బ్లాక్ నెంబర్ లో జిల్లా కోడ్, మండలం కోడ్,, ఈ. బి నంబర్, జిల్లా పేరు, మండలం పేరు, గ్రామ పంచాయితి) మున్సిపాలిటీ పేర్లు, ఆవాసం పేరు, వార్డ్ నెంబర్ , ఇంటి నెంబర్ , కుటుంబ క్రమ సంఖ్య ఇవన్నీ తప్పనిసరిగా ఫారం లో నమోదు చేయాలి, దీనికి విరుద్ధంగా స్టిక్కర్ లో నమోదు చేయకపోవడం, పేర్లు తప్పుగా నమోదు చేయడం స్వయంగా గమనించిన జిల్లా పాలనాధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు.సంబంధిత అధికారులందరూ ఎక్కడెక్కడ పొరపాట్లు ఉన్నాయో చూసి వాటిని సరి చేయాలనీ ఆదేశించారు. సర్వే లో తప్పులు దొర్లకుండా అతి జాగ్రత్తగా సర్వే నిర్వహించాలని అన్నారు.అనంతరం ముఖారా కె ఇంటింటి సర్వేను పరిశీలించి పకడ్బందీగా ఇండ్ల జాబితా వివరాలు నమోదు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో సీఈఓ జితేందర్ రెడ్డి, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపిడిఓ, ఏఓ, పంచాయితి సెక్రటరీ , కారోబార్, తదితరులు పాల్గొన్నారు.