-మంథనిలో ఘనంగా నాగుల చవితి వేడుకలు
-పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించిన మహిళలు
సిరా న్యూస్,మంథని;
మంథని పట్టణంలో నాగుల చవితి వేడుకలను మంగళవారం భక్తులు ఘనంగా జరుపుకున్నారు. మంథని మున్సిపల్ పరిధిలోని బోయినిపేటలోని శ్రీ నాగులమ్మ ఆలయం తో పాటు, పెంజేరుకట్టలోని నాగుల సంధిలో శ్రీనాగమయ్య పుట్ట వద్ద భక్తులు పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సల్లంగా చూడయ్యా నాగరాజా అంటూ మహిళలు నాగదేవతలను వేడుకున్నారు. తెల్లవారుజామునే పుణ్యస్నానాలు ఆచరించి నోముల దారాలు, నువ్వులు, పండ్లు, పాలతో పాటు చలిమిడి ముద్దలు తయారు చేసుకుని పుట్టల వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు చేసి నాగుల చవితిని ఘనంగా జరుపుకున్నారు.
ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. బోయినిపేటలోని నాగులమ్మ దేవాలయంలో గల మైసమ్మ, రావి, వేప చెట్లకు ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా మంథని మండలంలోని పలు గ్రామాల్లో నాగుల పంచమి వేడుకలను భక్తులు ఘనంగా నిర్వహించుకున్నారు. గాజులపల్లిలోని శ్రీ సంతాన నాగేంద్రస్వామి ఆలయంతో పాటు గ్రామాల్లోని పుట్టల వద్ద పూలు, పండ్లతో భక్తులు పూజలు నిర్వహించారు. సంతాన నాగేంద్రస్వామిగా మంథని ప్రాంతంలో పేరుగాంచి ఉండటంతో గ్రామస్తులతో పాటు ఇతర గ్రామాల నుంచి భక్తులు పెద్దఎత్తున వచ్చి, పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున ఆలయానికి భక్తులు తరలిరావడంతో ఆలయ ఆవరణ సందడిగా మారింది. నాగదేవత ఆలయాల వద్ద ఆవు పాలను ఉచితంగా భక్తులకు పంపిణీ చేశారు. మంథని పట్టణంలోని నాగుల సంధి వద్ద గల శ్రీనాగమయ్య పుట్ట, బోయినిపేటలోని నాగులమ్మ దేవాలయాన్ని, గాజులపల్లి సంతాన నాగేంద్ర స్వామి దేవాలయాన్ని మంథని మున్సిపల్ చైర్మన్ పెండ్రు రమా సురేష్ రెడ్డి సందర్శించి పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.