మూసి బ్యూటిఫికేషన్ సాధ్యమేనా….

సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణలో పది నెలల క్రితం రేవంత్‌రెడ్డి సారథ్యంలో కొలువుదీరిని కాంగ్రెస్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేస్తామని ముందుకు వచ్చింది. ఇందుకు రూ.1.50 లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. ఇప్పటి వరకు దేశంలోనే అతి పొడవైన గంగా నది ప్రక్షాళనకు కూడా ఇంత భారీగా నిధులు ఖర్చు చేయలేదు. నమామి గంగే పేరుతో చేపట్టిన రివర్‌ ఫ్రంట్‌ ప్రాజక్టులన్నీ విఫలమయ్యాయి. ఇలాంటి పరిస్థితిలో లక్షన్నర కోట్లకుపైగా ఖర్చు చేసినా మూసీ ప్రక్షాళన సాధ్యమవుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విఫలమైతే కాళేశ్వరం తరహాలోనే భారీగా నిధిలో మూసీలో పోసినట్లే అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా నిర్ణయం తీసుకోవడం సరికాదంటున్నారు నిపుణులు. శాస్త్రీయ అధ్యయనం, పర్యావరణ పరిస్థితులను అధ్యయనం చేయకుండా సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ముందస్తుగా పూర్తి చేయకుండా మూసీ రివర్‌ ఫ్రంట్‌ సక్సెస్‌ కాదని పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు దేశంలో శుద్ధి చేసేందుకు చేపట్టిన ప్రాజెక్టులను ఇందుకు ఉదహరిస్తున్నారు. ఇక ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లు కూల్చడంపైనా అభ్యంతరాలు చెబుతన్నారు.
గంగా నది కోసం..
హిందువులు పవిత్రంగా భావించే జీవనది గంగ. దీనిని శుద్ధి చేయడానికి కేంద్రలోని మోదీ సర్కార్‌ పదేళ్ల క్రితం నమామి గంగే పేరుతో శుద్ధి పనులు చేపట్టింది. కాలుష్య రహితంగా గంగా నదిని తీర్చిదిద్దుతామని తెలిపారు. ఇప్పటి వరకు రూ.40 వేల కోట్లు ఖర్చు చేశారు. అయినా నీరు శుద్ధి కాలేదు. నదిలో 50 శాతానికిపైగా మురుగునీరే అని ఎన్‌జీటీ తెలిపింది. ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన శుద్ధి ప్లాంట్లు సరిగా పనిచేయడం లేదని అంటున్నారు.నమామి గంగే ప్రాజెక్టు విఫలం కావడానికి కొన్ని కారణాలను గుర్తించారు. వ్యవసాయ, మానవ వ్యర్థాలతోపాటు పారిశ్రామిక వ్యర్థాలను నదిలోకి వదులుతుండడమే కాలుష్యానికి ప్రధాన కారణంగా గుర్తించారు. గతంలో రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో గంగా యాక్షన్‌ ప్లాన్‌ చేపట్టారు. 2016 నాటికి రూ.6,788,78 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటి వరకు గంగా నది శుద్ధికి 409 ప్రాజెక్టులు చేపట్టారు. అయితే ఈ నిధులన్నీ గంగపాలయ్యాయి.
బిలాస్‌పూర్‌ రివర్‌ ఫ్రంట్‌..
గుజరాత్‌లో ఆరు దశాబ్దాల క్రితంనాటి ప్రతిపాదనలను తెరపైకి తెచ్చి సబర్మతి యాక్షన్‌ప్లాన్‌ ను చూసి ఛత్తీస్‌గడ్‌లోని బిలాస్‌పూర్‌లో ఈ ప్రాజెక్టు ప్రారంభించారు. నగరంలో ప్రవహిస్తున్న ఆర్పా నదిని శుద్ధి చేయడమే దీని లక్ష్యం. అయితే ప్రాజెక్టు ప్రారంభించిన కొద్ది రోజులకే పనులు అటకెక్కాయి. రూ.1000 కోట్లు నిరుపయోగంగా మారాయి.గుజరాత్‌లోని సబర్మతీ నదిని శుద్ధి చేసేందుకు 2005లో సబర్మతీ యాక్షన్‌ప్లాన్‌ పేరుతో రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు తీసుకొచ్చారు. మోదీ మానస పుత్రికగా ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఇప్పటి వరకు రెండు విడతల్లో రూ. 1,400 కోట్లు ఖర్చు చేశారు. నదిలో నీటిని మాత్రం శుద్ధి చేయలేదు. అహ్మదాబాద్‌ శివారుల్లో పారిశ్రామిక వేత్తలు, స్థానిక రాజకీయ నాయకులు ఈ ప్రాజెక్టును ముందుకు సాగనివ్వలేదు. ప్రధాని మోదీ స్వయంగా దృష్టిపెట్టినా సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ట్యాంకుల నిర్వహణ లోపాలతో మురుగు కాలువలుగానే మిగిలింది.
ద్రవ్యావతి రివర్‌ ప్రాజెక్టు
రాజస్థాన్‌లో ప్రవహిస్తున్న ద్రవ్యావతి నది పునరుజ్జీవం కసం 2015లో అప్పటి ప్రభుత్వం రూ.1,676 కోట్లతో ద్రవ్యావతి రివర్‌ ప్రాజెక్టు చేపట్టింది. 47.7 కిలోమీటర్ల పొడువునా నదిని శుద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. జైపూర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ రోజుకు 170 మిలియన్‌ లీటర్ల నీరు శుద్ధి చేయాలనిలక్ష్యంగా పెట్టుకుంది. నది ఒడ్డున మొక్కల పెంపకం, కొత్త నిర్మాణాలు చేపట్టాలని నిర్ణింయింది. 2018 నాటికి పూర్తికావాల్సిన ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది.
నర్మదా యాక్షన్‌ ప్లాన్‌
మధ్యప్రదేశ్, గుజరాత్‌లో ప్రవహించే నర్మదా నది పరిరక్షణకు నీటిశుద్ధికి నదిపై పెద్ద డ్యామ్‌ నిర్మాణం క ఓసం నర్మదా యాక్షన్‌ ప్లాన్‌ ను మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టింది. పారిశ్రామిక వ్యర్థాలు నదిలో కలువకుండా చర్యలు తీసుకుంటామని రూ.15 వేల కోట్లు ఖర్చు చేసింది. అయితే వ్యర్థాలు రాకుండా కట్టడి చేయడంలో విఫలమైంది. తర్వాత పనులు అటకెక్కాయి.
ములా–ముటా ఆర్‌ఎఫ్‌డీ ప్రాజెక్ట్‌
ఇక మన పొరుగున ఉన్న మహారాష్ట్రలోని పూణె నగరం గుండా ప్రవహించే ములా–మటా నదులను 44 కిలోమీటర్లు శుద్ధి చేయడానికి ములా–ముటా పూణె రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు చేపట్టారు. నది నీటిని శుద్ధి చేయడం, నది ఒడ్డున 50 హెక్టార్ల విస్తీర్ణంలో గ్రీన్‌ బెల్ట్‌ ఏర్పాటు, వాణిజ్య సముదాయాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. .నదీ పరీవాహక ప్రాంతాలను ఖాళీ చేయించింది. తర్వాత నీటి శుద్ధిని గాలికి వదిలేసింది.
విశ్వామిత్ర రివర్‌ ప్రాజెక్ట్‌
గుజరాత్‌లోని వడోదరా నగరానికి వరదలు రాకుండా విశ్వామిత్ర రివర్‌ ప్రాజెక్టును 2010లో చేపట్టింది. వరదల మాట ఏమోగానీ భారీ ఎత్తున భూ ఆక్రమణలు జరిగాయి. నది నీటిని శుద్ధి చేసే సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ వ్యవస్థ నిర్వహణ సరిగా లేక నది శుద్ధి కాలేదు. నది ఒడ్డున ఇళ్లు కూల్చివేయించిన నేతలు తర్వాత వాటిని ఆక్రమించుకున్నారు.
చంబల్‌ రివర్‌ ఫ్రంట్‌
రాజస్థాన్‌లోని కోటాలో ప్రవహిస్తున్న చంబల్‌ నది శుద్ధి కోసం చంబల్‌ రివర్‌ ఫ్రంట్‌ చేపట్టారు. ఈ ప్రాజెక్టులో భాగంగా రాచరికం ఉట్టిపడేలా 26 ఘాట్లు నిర్మించారు. ఇది నాణేనికి ఒకవైపే. మరోవైపు ఘాట్లు నిర్మించిన స్థానంలో భూములకు పరిహారం చెల్లించలేదు. రివర్‌ ఫ్రంట్‌ ఆకర్షిస్తున్నా.. నదీ జలాల శుద్ధిమాత్రం జరుగలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *