సిరా న్యూస్;
నిరంతరం నిప్పుల మధ్యలో మండే కశ్మీర్‌కు మంచి రోజులు వచ్చాయని అనుకున్నారంతా! 370 ఎత్తేశాం.. అభివృద్ధి చేసేశాం అని చెప్పుకుంది కేంద్రం. పదేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలొచ్చాయ్ ప్రజాస్వామ్యం బతికిందని సంతోషపడ్డారు చాలా మంది. ఏకంగా, ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే తాజాగా ఉగ్ర దాడులు జరిగాయి. భారతదేశంలో అత్యంత ఉద్రిక్తతల నడుమ నలుగుతున్న ప్రదేశం జమ్మూ కశ్మీర్. రాష్ట్ర హోదా పోయి.. కేంద్ర పాలనలోకి వెళ్లిన కొన్నాళ్ల పాటు ఈ ప్రాంతంలో పరిస్థితులు సద్దుమణిగాయని అంతా అనుకున్నారు. అయితే, చాప కింద నీరులా వ్యాపించిన ఉగ్రవాద చర్యలు మాత్రం ఆగలేదు. ఈ మధ్య కాలంలో అవి మరింత ఊపందుకున్నాయి. గత కొన్ని నెలలుగా కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడులు పెరిగాయి. యాంటీ టెర్రర్ ఆపరేషన్లలో వీర జవానులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల కశ్మీర్ ఎన్నికలు ప్రశాంతంగానే జరిగినప్పటికీ.. ఎన్నికలు పూర్తయిన పది రోజుల తర్వాత, తాజాగా ఉగ్రవాదులు ఏడుగుర్ని పొట్టన పెట్టుకున్నారు. ఇది ఇలాగే కొసాగితే మళ్లీ 1990ల్లో పరిస్థితి చూడాల్సి వస్తుందనే భయం పట్టుకుంది. అందుకే, ఉగ్రమూకల ఉనికిని పూర్తిగా తుడిచేయడానికి భారత్ ఏం చేయాలనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం, మిడిల్ ఈస్ట్‌లో ఉగ్రవాదంపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్‌లా, భారత్ కూడా మిలిటెన్సీపై యుద్ధం ప్రకటించాలా అనే సందేహాలు కలుగుతున్నాయి.కశ్మీర్‌లో కొత్తగా ఏర్పడిన ఒమర్ అబ్ధుల్లా ప్రభుత్వానికి ఉగ్రవాదులు దాడులతో స్వాగతం పలికినట్లు కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు కొంత ఉద్రిక్త పరిస్థితులు చూసినప్పటికీ.. ఎన్నికల ప్రక్రియ సమయంలో అంతా సజావుగానే జరిగింది. ఇక, ఒమర్ అబ్ధుల్లా ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన పది రోజుల తర్వాత కశ్మీర్ మళ్లీ ఉలిక్కిపడింది. ఉగ్ర మూకలు ఒక్కసారిగా రెచ్చిపోయారు. సామాన్యులే టార్గెట్‌గా జరిగిన ఈ దాడిలో ఉగ్రవాదులు ఏడుగురిని హతమార్చారు. శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై టన్నెల్ నిర్మాణ పనుల ప్రాంతంలో ఉన్న ఒక వైద్యుడు, ఐదుగురు స్థానికేతరులను చంపేశారు.అక్టోబర్ 20 సాయంత్రం ఈ ఘటన జరిగింది. గందర్‌బాల్‌లోని గగంగీర్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ కంపెనీ క్యాంపు సైట్‌కు సమీపంలో గుర్తుతెలియని సాయుధులు వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపాయి. పనులు చేస్తున్న స్థానికులు, స్థానికేతర కార్మికులు, ఇతర సిబ్బందిపై ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఇందులో ఇద్దరు ఉద్యోగులు అక్కడికక్కడే మృతిచెందగా, ఐదుగురు ఆస్పత్రిలో మరణించారు. మరో ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అంతా ప్రశాంతంగా ఉంటుందని, ప్రజలకు రక్షణ కల్పిస్తామని నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం ప్రకటించిన వారం రోజులకే సామాన్యులపై దాడి జరగడం ఇప్పుడు ఆందోళనను పెంచుతోంది.తాజా ఉగ్రదాడిలో మృతిచెందిన వారిలో బుద్గామ్‌కు చెందిన డాక్టర్ షెహనవాజ్‌తో పాటు కార్మికులు, ఫహీమ్ నజీర్, కలీం, మహ్మద్ హనీఫ్, శశి అబ్రోల్, అనిల్ శుక్లా, గుర్మిత్ సింగ్‌లు ఉన్నారు. అయితే, ఉగ్రదాడిపై సమాచారం అందుకున్న భద్రతా బలగాలు వెంటనే రంగంలోకి దిగాయి. ఘటన స్థలాన్ని చుట్టుముట్టాయి. ఉగ్రవాదుల కోసం విస్తృతంగా గాలింపు చేపట్టాయి. అయితే, దీనికి ముందు, అక్టోబర్ 18న షోపియాన్ ప్రాంతంలో ఉగ్రదాడుల్లో బుల్లెట్ గాయాలతో ఓ బిహార్ కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన జరిగిన రెండు రోజులకే మరో ఉగ్రదాడి జరిగడంపై సర్వత్రా ఆందోళన నెలకొందికాగా, కశ్మీర్‌లో ఉగ్రదాడిని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్రంగా ఖండించారు. ఉగ్రమూకలను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.కాల్పుల ఘటనను జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా.. నిరాయుధ అమాయక ప్రజలపై జరిగిన ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు. కశ్మీర్ నుండి ఉగ్రవాదాన్ని తుడిచేయాలని పిలుపునిచ్చారు.జమ్మూకశ్మీర్‌లో, ఇటీవలి కాలంలో, పౌరులే లక్ష్యంగా దాడులు చేసి హతమార్చుతున్న ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. అయితే, జమ్మూ కశ్మీర్‌లని గాందర్బల్ జిల్లాలో ఉగ్ర దాడులు వెనుక లష్కరే తొయిబా అనుబంధ శాఖ ప్రమేయం ఉన్నట్లు భారత ఇంటెలిజెన్స్ వర్గాలు చెబతున్నాయి. ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ సంస్థ ఈ ఉగ్రదాడికి పాల్పడినట్లుగా స్థానిక మీడియాల్లో కథనాలు వచ్చాయి. రెసిస్టెన్స్ ఫ్రంట్ చీఫ్ షేక్ సజ్జద్ గుల్ ఈ దాడికి సూత్రధారి అని గుర్తించినట్లు సమాచారం. సజ్జద్ ఆదేశానుసారమే ఉగ్రవాదులు, కశ్మీరేతరుల్ని లక్ష్యంగా చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. కాగా, కశ్మీరీయేతరులే లక్ష్యంగా ఉగ్రవాదులు జరుపుతున్న ఈ దాడులను భద్రతా బలగాలు సీరియస్‌గా తీసుకున్నాయి. ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఘటన జరిగిన ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఉగ్రవాదులు తప్పించుకోకుండా.. డేగకన్నుతో వేట సాగిస్తున్నారు. ఉగ్రమూకలను ఏరివేసేందుకు పకడ్బందీగా ముందుకు కదులుతున్నారు. ఇందుకోసం భారీ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు సమాచారం.ఇటీవలి ఈ దాడులకు సంబంధించి, భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను పట్టుకున్నాయి. పూంచ్ జిల్లాలోని సూరంకోట్ నుంచి ఉగ్రవాదులను పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. అక్టోబరు 18న ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌ల ఆధారంగా పూంచ్ సెక్టార్‌లో భారత సైన్యం, జమ్మూ కశ్మీర్ పోలీసులు జరిపిన సంయుక్త ఆపరేషన్‌లో ఉగ్రవాదులు అబ్దుల్ అజీజ్, మన్వర్ హుస్సేన్ పట్టుబడ్డారు. భద్రతా దళాలు అనుమానితుల నుండి ఆయుధాలు, మందుగుండు సామగ్రి, గ్రెనేడ్‌లను స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఇద్దరు ఉగ్రవాదులూ… మతపరమైన ప్రదేశాలు, ఆసుపత్రులపై గ్రెనేడ్ దాడులు చేశారనీ. టెర్రర్ ఫైనాన్సింగ్, దేశ వ్యతిరేక ప్రచారం, ఆయుధాల స్మగ్లింగ్‌తో సహా ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించడంలో పాలుపంచుకున్నారని అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్ టెర్రర్ నెట్‌వర్క్‌లను నిర్మూలించడంలో కీలకమైన దశను సూచిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.గగాంగీర్‌లో జరిగిన ఈ ఉగ్రదాడిని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా కూడా ఖండిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ నాయకత్వానికి భారత్‌తో సత్సంబంధాలు కావాలంటే ఉగ్రవాదాన్ని అంతం చేసి, జమ్మూ కశ్మీర్ ప్రజలను గౌరవంగా జీవించేలా చేయాలని కోరారు. ‘భారత్‌తో సత్సంబంధాలు కావాలంటే, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడానికి ముగింపు పలకాలని పాకిస్తాన్ నాయకత్వానికి చెప్పాలని అనుకుంటున్నాని అన్నారు. కశ్మీర్‌లో అమాయక ప్రజలను చంపితే చర్చలు జరుగుతాయా? అని ప్రశ్నించారు. ‘కశ్మీర్ పాకిస్థాన్ నహీ బనేగా…’, ఉగ్రవాదాన్ని అంతం చేసే సమయం వచ్చింది, లేకపోతే ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.