సిరా న్యూస్,హైదరాబాద్;
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో.. హైదరాబాద్‌కు తాగునీటిని సరఫరా చేసేందుకు గానూ గోదావరి ఫేజ్-2 పథకం కింద తలపెట్టిన కేశవపురం రిజర్వాయర్ కాంట్రాక్టును రేవంత్ రెడ్డి సర్కార్ రద్దు చేసింది. గోదావరి జలాలను కొండపోచమ్మసాగర్ నుంచి కేశవాపురం రిజర్వాయర్‌కు తీసుకొచ్చి.. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తాగునీటి అవసరాల కోసం బీఆర్ఎస్ సర్కార్ చేపట్టిన ఈ ప్రాజెక్టును ప్రభుత్వం విరమించుకుంది. ఈ ప్రాజెక్టు కోసం మేఘా ఇంజినీరింగ్ కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్టును రద్దు చేస్తూ ప్రభుత్వం నవంబర్ 05 తేదీన ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ కాంట్రాక్టును రద్దు చేయడంతో పాటు మూసీ పునరుజ్జీవంలో భాగంగా ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌కు గోదావరి జలాలను మళ్లించే ప్రాజెక్టుకు టెండర్ పిలిచేందుకు హైదరాబాద్ జలమండలికి అనుమతిని కూడా ఇచ్చింది.వాస్తవానికి కొండపోచమ్మ సాగర్ నుంచి కేశవపురం రిజర్వాయర్‌కు అక్కడి నుంచి హైదరాబాద్‌కు తాగు నీటిని తీసుకురావావని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే.. సుమారు 2050 వరకు హైదరాబాద్ నీటి అవసరాలను తీర్చగలదని గత ప్రభుత్వం అంచనావేసింది. అయితే.. రేవంత్ రెడ్డి సర్కార్.. మాత్రం ఈ కాంట్రాక్టును రద్దు చేసింది. ఈ కేశవపురం ప్రాజెక్టు వల్ల ప్రభుత్వంపై అధిక భారం పడనుందని భావించగా.. దీనికంటే తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయాన్ని అనుసరించాలని నిర్ణయించుకుందిఈ కాంట్రాక్టును రద్దు చేయడం వల్ల హైదరాబాద్‌లోని నీటి అవసరాల కోసం గోదావరి ఫేజ్-2 పథకాన్ని మల్లన్నసాగర్ నుంచి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్‌ల వరకు పొడిగించడానికి ఖర్చు చేసే నిధుల్లో సుమారు రూ. 2,000 కోట్లు ఆదా అవుతాయని రేవంత్ రెడ్డి సర్కార్ అంచనా వేస్తోంది. సవరించిన ప్రణాళిక ప్రకారం.. మల్లన్నసాగర్ నుంచి 15 టీఎంసీల నీటిని పంపింగ్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో హైదరాబాద్‌కు 10 టీఎంసీలు వాడుకోనుండగా.. జంట జలాశయాలకు 5 టీఎంసీలు మళ్లించాలని నిర్ణయించినట్టు సమాచారం.అయితే.. ఈ ప్రాజెక్టుకు కేబినెట్ కూడా ఆమోదం తెలపగా.. త్వరలోనే టెండర్లు పిలవాలని హైదరాబాద్ వాటర్ బోర్డు అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే.. కొత్త ప్రాజెక్టు డిజైన్ వల్ల.. పంపింగ్ అవసరం తగ్గటమే కాకుండా.. మెయిన్‌టెనెన్స్, విద్యుత్ ఖర్చులు కూడా గణనీయంగా తగ్గనున్నాయి. నీటిని ఆరుసార్లు ఎత్తివేయాల్సిన అవసరం కాకుండా.. కొత్త అలైన్‌మెంట్ దీనిని కేవలం రెండు పంప్ పాయింట్‌లకు తగ్గించి, ఉస్మాన్ సాగర్‌కు చేరుకోవడానికి దాదాపు 162 కిలోమీటర్ల మేర విస్తరించింది.సవరించిన ప్రాజెక్ట్ డిజైన్ నీటి సరఫరా ఖర్చు కిలోలీటర్‌కు దాదాపు రూ.4కు తగ్గుతుందని అధికారులు అంచనా వేశారు. ఇది హైదరాబాద్‌లో పెరుగుతున్న నీటి అవసరాలను తీర్చేందుకు ప్రస్తుతం ఖర్చు చేస్తున్న రూ. 48 నుంచి భారీగా తగ్గించినట్టవుతుందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది.