స్వచ్ఛత హి సేవా కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు అవ్వండి

గురువారం ఉదయం 3కె రన్, వేస్ట్ టూ వండర్ పోటీలు

కమిషనర్ ఎన్.మౌర్య

సిరా న్యూస్,తిరుపతి;
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛతా హి సేవ కార్యక్రమాలలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య పిలుపునిచ్చారు. స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం సీతమ్మ నగర్ రోడ్డు, వెంకటరమణ లేఔట్ లోని పార్కు నందు విద్యార్థులు, మహిళలతో కలసి కమిషనర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కమిషనర్ మౌర్య మాట్లాడుతూ గాంధీ జయంతిని పురస్కరించుకుని 15 రోజులపాటు స్వచ్ఛతాహి సేవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. పారిశుద్ధ్య పనులు, పార్కుల్లో, ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటడం, తడి, పొడి చెత్త వేరు చేయడం వంటి వాటిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పరిరక్షించాల్సిన బాధ్యతః అందరిపైన ఉందని అన్నారు. పరిశుభ్రత అంటే ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో భాగంగా 26 వతేదీ గురువారం ఉదయం మూడు కిలోమీటర్ల పరుగు పందెం, వేస్ట్ టు వండర్ పోటీలు, వీధి నాటకాలు, పారిశుధ్య కార్మికులకు పి.పిఈ కిట్ల పంపిణీ, ఆరోగ్య పరీక్షల నిర్వహణ వంటి పలు కార్యక్రమాలు నిర్వహించనున్నామని అన్నారు. ఉదయం 6 గంటలకు వివేకానంద కూడలి నుండి ఎస్.వి.యూనివర్సిటీ వరకు ఈ పరుగుపందెం ఉంటుందని తెలిపారు. ఈ స్వచ్ఛత హి సేవ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు మన వంతు బాధ్యతగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డి.ఈ.మహేష్, శానిటరీ సూపర్ వైజర్ చెంచయ్య, మెప్మా కృష్ణవేణి, తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *