సిటీ మొత్తం మెట్రో పరుగులు

సిరా న్యూస్,హైదరాబాద్;

తెలంగాణ రాష్ట్ర రాజధాని లో ఇప్పటికే మెట్రో రైళ్లు, ప్రజా రవాణా వ్యవస్థలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. ఉదయం నుండి రాత్రి వరకు ఒక్క క్షణం తీరిక లేకుండా, మెట్రో రైళ్లు నిరంతరం హైదరాబాద్ సిటీలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. విద్యార్థులు, పలు ప్రైవేట్ జాబ్ లలో రాణించేవారికి మెట్రో రైలు సదుపాయం వరమని చెప్పవచ్చు. అటువంటి మెట్రో వ్యవస్థను హైదరాబాద్ నగరంలో మరింత విస్తృత పరిచేందుకు తెలంగాణ కేబినెట్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరికిందంటే అది మెట్రో రైలు వ్యవస్థతోనే. ప్రతి రోజూ లక్షల మంది ప్రయాణీకులు మెట్రో రైలులో ప్రయాణం సాగిస్తున్నారంటే, నగరవాసులు ఈ సదుపాయాన్ని ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటున్నారో చెప్పవచ్చు. అందుకే కాబోలు మెట్రో రైళ్ల వ్యవస్థను మరింత విస్తృత పరిచేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మూడు లైన్ల ఆధారంగా రవాణా వ్యవస్థలో విస్తృత సేవలు అందిస్తున్న మెట్రో.. ఇక మున్ముందు నగరంలోని అన్ని మూలలకు విస్తరించనుంది. ఈ మేరకు కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రులు ప్రకటించారు. సుదీర్ఘంగా సాగిన కేబినెట్ మీటింగ్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై సీఎం చర్చించారు. ప్రధానంగా మెట్రో రైలు రెండో దశ విస్తరణకు సంబంధించి డీపీఆర్ కు కేబినెట్ భేటీలో ఆమోదం లభించింది.ఇక మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించి మొత్తం 76.4 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మించాలన్న ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలుపగా, నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాగోల్ నుండి శంషాబాద్, రాయదుర్గం నుండి కోకాపేట్, ఎంజీబీఎస్ నుండి చాంద్రాయణగుట్ట, మియాపూర్ నుండి పటాన్ చెరువు, ఎల్బీనగర్ నుండి హయత్ నగర్ ఇలా మొత్తము 76.4 కిలోమీటర్ల మేరకు మెట్రో రవాణా వ్యవస్థను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు ఈ ప్రాజెక్టు కోసం రూ. 24,269 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి డీపీఆర్ ను కేంద్రానికి పంపించేలా మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామం.కేబినెట్ భేటీలో తీసుకున్న ఈ నిర్ణయంతో హైదరాబాద్ నగరవాసుల మెట్రో పూర్తి కల నెరవేరుతుందని చెప్పవచ్చు. కేంద్రం నుండి ఆమోదం రాగానే, ఇక చకచకా మెట్రో రైలు రెండో దశ పనులు ప్రారంభం కానున్నాయని చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *