సిరా న్యూస్,హైదరాబాద్;
రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్ బాధితులు వరుసగా బయటకొస్తున్నారు. ఈడీ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా తట్టి అన్నారంలోని మధురానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ బాధితులు ఫిర్యాదు చేయగా, తాజాగా వట్టినాగులపల్లిలోని శంకర్ హిల్స్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ఈడీని కలిసింది. రూ.20 వేల కోట్ల భూమిని దోపిడీ చేశారని శంకర్ హిల్స్ అసోసియేషన్ సభ్యులు అంటున్నారు. వట్టినాగులపల్లిలోని సర్వే నెంబర్ 111 నుంచి 179లో 460 ఎకరాల 6 గుంటల ల్యాండ్‌లో భారీ కుంభంణం జరిగిన్నట్లు ఈడీకి ఫిర్యాదు చేశారు.గతంలో శంకర్ హిల్స్ ప్లాట్ పర్చేసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 460 ఎకరాలు భూమిని కొనుగోలు చేసింది. ఈ భూమిని 3 వేల 328 ప్లాట్స్‌గా మార్చి విక్రయించింది. అయితే, అమోయ్ కుమార్ మాత్రం కొనుగోలు చేసిన ఓనర్ల పేర్లను ధరణిలో నమోదు చేయలేదు. తిరిగి రైతుల పేర్ల మీదకే మార్చి, తర్వాత ఫినిక్స్ సంస్థకు అప్పగించారు. దీంతో 3 వేల 328 మంది దాకా ప్లాట్ ఓనర్లు రోడ్డున పడ్డామంటున్నారు. ఈ ల్యాండ్ విలువ 20 వేల కోట్లపైనే మార్కెట్ విలువ ఉంటుంది. ఆ భూమిని అమోయ్ అక్రమార్కులకు కట్టబెట్టాడని ఆరోపిస్తున్నారు.అమోయ్ కుమార్ అరాచకాలపై ఈడీకి ఇప్పటికే రంగారెడ్డి జిల్లా తట్టి అన్నారంలోని మధురానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ బాధితులు ఫిర్యాదు చేశారు. అమోయ్ కుమార్ ధరణిని అడ్డు పెట్టుకొని అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. 200 ఎకరాలకు అక్రమ రిజిస్టేషన్లు చేశారని వాపోయారు. తమ ప్లాట్లను ఎకరాల్లోకి మార్చి అడ్డగోలు రిజిస్ట్రేషన్లు చేశారని ఫిర్యాదు చేశారు. హైకోర్టు స్టే ఆర్డర్ ఉన్నా అధికారులు పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 7 గంటలకు రిజిస్ట్రేషన్, రాత్రికి రాత్రే పత్రాలు సృష్టించారు అని వాపోతున్నారు బాధితులు. ఇదే సమయంలో శంకర్ హిల్స్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ కూడా ఫిర్యాదు చేయడంతో అమోయ్ సాగించిన లీలలు ఇంకెన్ని ఉన్నాయన్న చర్చ జరుగుతోంది.