సిరా న్యూస్,అవనిగడ్డ;
నాగులచవితి పర్వదినం అనాదిగా వస్తున్న పర్వదినం అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. సుప్రసిద్ధ మోపిదేవి పుణ్యక్షేత్రంలో నాగుల చవితి వేడుకలను ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ప్రారంభించారు. మంగళవారం తెల్లవారుజామున కుటుంబ సమేతంగా విచ్చేసిన ఎమ్మెల్యే స్వామివారి నాగ పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు. గర్భాలయంలో కొలువున్న స్వామి దర్శించుకుని పూజలు జరిపించుకున్నారు. దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాద రావు ఆధ్వర్యంలో వేద పండితులు ఆయనను ఘనంగా సత్కరించి స్వామివారి చిత్రపటాలు ప్రసాదాలు బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొహాంజోదారో శిధిలాల్లో కూడా నాగదేవతకు కొలవటం కనిపిస్తుందన్నారు. బౌద్ధుల కాలంలో కూడా నాగదేవతకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. చారిత్రాత్మకమైన మోపిదేవి దేవాలయానికి ఎంతో విశిష్టత ఉందని, మహాకవి వేమన శతకాల్లో కూడా మోపిదేవి దేవస్థానం ప్రస్తావన ఉంటుందన్నారు. మోపిదేవి క్షేత్రాన్ని దర్శించుకుంటే ఖచ్చితంగా ఫలసిద్ధి జరుగుతుందనే విశ్వాసం తెలుగు వారందరిలో ఉందన్నారు