పరీక్షా పే చర్చతో లాభం ఎవరికి.. నష్టం ఎవరికి
సిరా న్యూస్,కరీంనగర్;
పరీక్షల చుట్టూ జరుగుతున్న రచ్చను ఒక్కొక్కటిగా ఇప్పుడు డీకోడ్ చేద్దాం. గ్రూప్ 2 వాయిదా వేయాలన్నారు. వాయిదా వేసేశారు. మొన్నటికి మొన్న డీఎస్సీ వాయిదా వేయాలన్నారు. చివరి దాకా ప్రయత్నాలు జరిగాయి. ఒత్తిడి పెంచారు. ఆందోళనలు చేశారు. కానీ ప్రభుత్వమే చాలా సీరియస్ గా తీసుకుని ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది. టైంకు రిజల్ట్ ఇచ్చింది. నియామకపత్రాలు కూడా ఇచ్చేశారు. కొత్త టీచర్లు అప్పుడే డ్యూటీలు ఎక్కేశారు. పిల్లలకు పాఠాలు చెబుతున్నారు కూడా. ఆ పది వేల మంది కళ్లల్లో, వారి ఇళ్లల్లో, కుటుంబాల్లో ఆనందం అంతా ఇంతా కాదు.నిజానికి ఇదే డీఎస్సీ వాయిదా పడి ఉంటే అసలు ఎప్పుడు జరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఉండేది. వీరంతా అలా నిరుద్యోగులుగానే ఉండిపోవాల్సి వచ్చేది. ఎందుకంటే ప్రతి పరీక్షకు ఏదో ఒక అడ్డంకి ఉంటూనే ఉంటుంది. కోర్టు కేసులు, చిక్కులు, రిజర్వేషన్లు, ప్రశ్నాపత్రాలు, కీ, ఇలాంటివెన్నో. అన్నీ అధిగమించినా ఏదో ఒకటి కొత్తగా తెరపైకి వస్తూనే ఉంటుంది. కానీ వీటన్నిటికంటే ముఖ్యం.. గత పదేళ్లుగా ఉద్యోగాలకు నోచుకోని వారిని ఇంకా నిరీక్షించేలా చేయడం ముమ్మాటికీ తప్పుడు నిర్ణయమే అవుతుంది. అందుకే రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించింది. వరుసగా ఎగ్జామ్స్ పెడుతూ వెళ్తున్నారు. ఎంత ఒత్తిడి వచ్చినా, అడ్డంకులు వచ్చినా డీఎస్సీ నిర్వహించింది అందుకే.ఇటీవలే గ్రూప్ 2 విషయాన్ని చూద్దాం. ఆగష్ట్‌లో జరగాల్సిన పరీక్షలను డిసెంబర్‌కు రీ షెడ్యూల్ చేశారు. అందులోనూ కొన్ని టెక్నికల్ సమస్యలు వచ్చాయి. సరే ప్రభుత్వం కూడా వాటిని నిర్ధారణ చేసుకుని వాయిదా వేసింది. వాయిదా వేయాలంటే ఎంతో కొంత సహేతుక కారణాలు ఉండాలి కదా. అందుకే రీ షెడ్యూల్ అయింది. కానీ పరీక్షలన్నిటికీ ఇలాంటివేవో అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. కొందరి కోసం మెజార్టీ ఉద్యోగార్థులను ఇబ్బంది పెట్టడం కూడా సరికాదన్న అభిప్రాయాలు నిరుద్యోగుల్లో వ్యక్తమవుతోంది.ఇప్పుడు గ్రూప్ 1 విషయానికొద్దాం. అసలు తెలంగాణ సాధించుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాలు. అవి నెరవేరలేదన్న ఉద్దేశంతోనే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ కు పట్టం కట్టారు. రేవంత్ ప్రభుత్వం వస్తూనే.. 90 రోజుల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామకపత్రాలు ఇచ్చింది. ఎందుకంటే పదేళ్ల నిరుద్యోగం తెలంగాణలో ఎలా పోగు పడిందో చూశారు. అందుకే వారి బాధలు అర్థం చేసుకుని ఖాళీలను గుర్తించడం, వెంటనే పరీక్షలు పెట్టడం చకచకా జరుపుతోంది. తెలంగాణ ఏర్పడ్డాక ఇప్పటి వరకు గ్రూప్ 1 నిర్వహించలేదు. ఇంతకంటే ఘోరం ఉంటుందా? గత ప్రభుత్వ హయాంలో లీకులు, రద్దు, వాయిదాల పర్వంతో అడుగు ముందుకు పడలేదు. ఇప్పుడు కాస్తో కూస్తో.. అడుగు పడి గ్రూప్ 1 ప్రిలిమ్స్ సక్సెస్ ఫుల్ గా నిర్వహించారు. ఇక మెయిన్స్ పరీక్ష అక్టోబర్ 21 నుంచి 27వ తేదీ వరకు జరగాల్సి ఉంది. ఇప్పటికే హాల్ టిక్కెట్లు ఇష్యూ చేశారు. అభ్యర్థులు డౌన్ లోడ్ కూడా చేసుకున్నారు. కట్ చేస్తే అశోక్ నగర్ లో సీన్ ఇదీ.కొందరు గ్రూప్ 1 అభ్యర్థులు కేటీఆర్ దగ్గరికి వెళ్లారు. సీన్ లోకి కేటీఆర్ ఎంట్రీ ఇచ్చారు. తెలంగాణ భవన్ కు వారిని పిలిపించుకున్నారు. కష్టాలున్న వారంతా తెలంగాణ భవన్ వస్తున్నారని చెప్పుకొచ్చారు. జీవో 29 వల్ల పరీక్ష మళ్లీ రద్దయితే ఇబ్బంది వస్తుందని నిరుద్యోగులు తన దృష్టికి తీసుకొచ్చారంటున్నారు. రిజర్వేషన్ల విషయంలో సరైన రూల్స్ పాటించకపోవడంతోనే అంతా ఆందోళనకు దిగుతున్నారని మెయిన్స్ పరీక్షలకు నాలుగు రోజుల ముందు చెప్పడమే అసలు ట్విస్ట్.ఇప్పుడు లోపభూయిష్ట విధానాల గురించి మాట్లాడుతున్న కేటీఆర్.. బీఆర్ఎస్ హయాంలో గ్రూప్ 1 ఎగ్జామ్ ఎంత గజిబిజి గందరగోళం అయిందో గుర్తు తెచ్చుకుంటే మంచిదని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. అసలు నిరుద్యోగుల గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్ కు లేదంటున్నారు. నాటి TSPSC తొలిసారిగా 2022 ఏప్రిల్‌లో గూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ తర్వాత అదే సంవత్సరం అక్టోబర్‌లో ప్రిలిమ్స్ ఎక్జామ్స్ నిర్వహించి మెయిన్ పరీక్షలకు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. అయితే క్వశ్చన్ పేపర్ లీకేజీతో ఆ పరీక్షను కమిషన్ రద్దు చేసింది. ఆ తర్వాత గతేడాది జూన్ 11న రెండోసారి ప్రిలిమ్స్ నిర్వహించగా నిర్వహణ ప్రక్రియలో చాలా లోపాలు జరిగాయి. దీంతో కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడం, ఆ పరీక్షను కోర్టు రద్దు చేయడం జరిగిపోయాయి. తాజాగా అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వం కమిషన్‌ను ప్రక్షాళన చేయడంతో పాటు కొత్తగా 63 పోస్టులను జత చేసి భర్తీకి ఆమోదం తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్తగా 563 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంత తతంగం జరిగింది. జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ సక్సెస్ ఫుల్ గా జరిగింది కూడా. కోర్టు కేసులు కూడా తొలగిపోయి. మరో 2 రోజుల్లో అంటే అక్టోబర్ 21 నుంచి మెయిన్స్ పరీక్షలు జరగనుందనగా ఇప్పుడు పరీక్షాపే రచ్చ జరుగుతోంది.వాయిదాలు లేకుండా, కేసులు లేకుండా, లీకులు లేకుండా ఎగ్జామ్స్ నిర్వహించొద్దని అనుకుంటున్నారా అని కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ ను ప్రశ్నిస్తున్న పరిస్థితి. బీఆర్ఎస్ నేతల కొలువులే పోయాయాని, ఇప్పుడు కొలువుల అవసరం ఏంటన్నదే బీఆర్ఎస్ విధానమా అని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి క్వశ్చన్ చేస్తున్నారు. గులాబీలకు కొలువులు వచ్చే వరకు ఏ జాబులూ రాకుండా చూడడమే ఉద్దేశమా అని కౌంటర్ వేస్తున్నారు.