సిరా న్యూస్,వరంగల్;
ఇనుప కండరాలు ఉక్కు నరాలు
కలిగిన యువత దేశానికి అవసరమని వివేకానందుడు చెప్పిన మాటలు స్ఫూర్తితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుట్కాలను నిషేధించి యువతను సత్ప్రవర్తన కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో చేపట్టిన చర్యలు క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. పరకాల డివిజన్లో నిషేధిత గుట్కాలతో పాటు గంజాయి లాంటి మత్తు పదార్థాలు యువతను పీల్చుకుచేస్తున్నాయి. ఐనా ఇవేమీ పట్టనట్లు పోలీసులు మామూళ్ల మత్తులో తూలుతున్నారని ప్రజలు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ఇటీవల కొందరు యువకులు పరకాలను కేంద్రాన్ని చేసుకొని గంజాయి విక్రయాలు జరుపుతున్న యువకులను టాస్క్ పోర్ట్ పోలీసులు వలపన్ని పట్టుకొని కేసులు నమోదు చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇవేమీ పట్టించుకోని కొందరు వ్యాపారస్తులు పరకాల పట్టణంలో నిషేధిత గుట్కాలు అంబర్ ప్యాకెట్లు జంకు బంకు లేకుండా అమ్మడం జరుపడం పలువురుని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పరకాల పట్టణంలోని కొందరు షాపుల యజమానులు తోరణాలు కట్టి అమ్మడం ఇక్కడ సర్వసాధారణంగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరకాల అంటేనే అక్రమ వ్యాపారాలకు అడ్డా అన్న నానుడి ప్రజల్లో వినిపిస్తుంది. అమ్మేవారు కొనేవారు ఎక్కువగా ఉండడంతో నిషేధిత గుట్కాల వ్యాపారం పరకాల పట్టణంలో మూడు పువ్వులు ఆరు కాయలు అన్న రీతిలో కొనసాగుతుందని ప్రజలు విమర్శిస్తున్నారు. పోలీసులు ఇతర విభాగాలకు చెందిన అధికారులు గుట్కాల నియంత్రణను పట్టించుకోకపోవడంపై ప్రజల్లో పలు రకాలై పుకార్లు వినిపిస్తున్నాయి. అప్పుడప్పుడు పోలీసులు కేసులు పెట్టినప్పటికీ వ్యాపారస్తులు ఇవేమీ పట్టించుకోనట్లు వ్యాపారాన్ని కొనసాగించడంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికైనా పరకాలలో జోరుగా సాగుతున్న నిషేధిత గుట్కాల వ్యాపారం పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించి యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.