స్వరూపనంద భూములు వెనక్కి..?

సిరా న్యూస్,విశాఖపట్టణం;
గత ఐదేళ్లలో మార్మోగిన పేరు స్వామి స్వరూపానంద. విశాఖ శారదా పీఠానికి చెందిన స్వరూపానంద గత ఐదేళ్ల కాలంలో రాజ గురువుగా మారిపోయారు. 2019లో జగన్ అధికారంలోకి రావడానికి స్వరూపానంద చేసిన యాగాలే కారణమని వైసిపి నేతలు విశ్వసించారు.గత ఐదేళ్లుగా శారదా పీఠానికి క్యూ కట్టారు. పర్వదినం నాడు జగన్ ఆగమేఘాలపై విశాఖ శారదా పీఠంలో వాలిపోయేవారు.అటు స్వామీజీ సైతం రాష్ట్ర ప్రభుత్వ ఆగమ సలహాదారుడిగా వ్యవహరించేవారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో చేర్పులు మార్పులు కూడా చేయించినట్లు ఆరోపణలు ఉండేవి. ఏడాదిలో రెండుసార్లు అయినా జగన్ విశాఖలోని శారదా పీఠాన్ని సందర్శించేవారు. గత ఐదేళ్ల వైసిపి పాలనలో విశాఖ శారదా పీఠానికి ఎంతో ప్రాముఖ్యత ఉండేది. అక్కడ జరిగే ప్రతి కార్యక్రమానికి రాష్ట్రంలో పేరు మోసిన వైసీపీ నేతలు వచ్చేవారు. అయితే ఎన్నికల్లో జగన్ ఓడిపోవడంతో స్వామీజీ కనిపించకుండా పోయారు. అయితే ఒకసారి మాట మార్చారు కూడా. తాను అభిమానించే నేతల్లో చంద్రబాబు ఒకరు చెప్పుకొచ్చారు. మంచి పాలనా దక్షుడిగా కొనియాడారు. అయితే ఇటీవల టీటీడీ లడ్డు వివాదం జాతీయ స్థాయిలో ప్రకంపనలు రేపింది. దేశంలో హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు, స్వామీజీలు ఖండించారు. కానీ స్వరూపానంద మాత్రం ఎక్కడా కనిపించలేదుఅయితే స్వరూపానంద కేవలం ఏపీ ప్రభుత్వానికి మాత్రమే రాజ గురువు కాదు. తెలంగాణలో కెసిఆర్ కు సైతం రాజ గురువుగా వ్యవహరించారు. వాస్తవానికి 2014 ఎన్నికలకు ముందు కెసిఆర్ స్వరూపానంద నేతృత్వంలో యాగాలు చేశారు. అధికారంలోకి రాగలిగారు. 2018 ఎన్నికల్లో కూడా అంతే. ఎన్నికలకు ముందు స్వామీజీ యాగం చేశారు. రెండోసారి కెసిఆర్ అధికారంలోకి రాగలిగారు. అప్పుడే తన సన్నిహితుడు స్నేహితుడైన జగన్ కు విన్నవించారు కేసీఆర్. కెసిఆర్ ద్వారా స్వామీజీకి జగన్ దగ్గరయ్యారు. అయితే ఈ ఎన్నికల్లో ఇప్పుడు ఇద్దరూ ఓడిపోవడంతో స్వామీజీ కనుమరుగైపోయారు.అయితే ఆ మధ్యన చంద్రబాబుకు పొగడ్తల వెనుక విశాఖలో శారదా పీఠం భూములు ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ హయాంలో భీమిలి బీచ్ సమీపంలో.. విశాఖ శారదా పీఠానికి 15 ఎకరాల భూమిని కేటాయించారు. అక్కడ వైదిక యూనివర్సిటీ ఏర్పాటుకు స్వామీజీ కోరడంతో భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కేవలం నామమాత్రపు ధరగా లక్ష రూపాయలు తీసుకొని 15 ఎకరాల భూమిని కేటాయింపులు చేశారు. బహిరంగ మార్కెట్లు ఆ భూముల ధర 225 కోట్లు గా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై టిడిపి, జనసేన ఆందోళనలు కూడా చేశాయి. అయితే అప్పట్లో జగన్ సర్కార్ మొండిగా ముందుకెళ్లింది. దీనికి తోడు అదే భూమిని కమర్షియల్ గా మార్చుకుంటానని జగన్ సర్కార్ కు దరఖాస్తు చేసుకున్నారు స్వామీజీ. కానీ ఇంతలోనే ప్రభుత్వం మారిపోయింది. దీంతో చంద్రబాబుకు స్వామీజీ పొగడ్తల వెనుక కారణం అదేనని తెలుస్తోంది. కానీ త్వరలో చంద్రబాబు సర్కార్ స్వామీజీకి షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎంతో విలువైన ఆ భూమిని వెనక్కి తీసుకోనున్నట్లు సమాచారం. అదే జరిగితే స్వామీజీ ఎలా స్పందిస్తారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *